తిరుమల శ్రీవారిది ఏ రూపం …?

0
1087

తిరుమలంటే అదో విశేషాల ఖజానా. అదో అంతుచిక్కని రహస్యాల నిధి. ఏడేడు పదనాలుగు లోకాల్లోని అపురూప సమాచారమంతా ఆ ఏడు కొండల్లో- నిక్షిప్తమై ఉంటుందంటే ఎలాంటి అనుమానం లేదు. అన్నమయ్య అన్నివేల కీర్తనలు పాడాడంటేనే తెలియడం లేదూ… అది కవులకూ కవనవనమనీ- శ్రామికులకు కార్యక్షేత్రమనీ- భక్తులపాలిట వైకుంఠమని- శరణార్ధులకు అభయమిచ్చే ప్రాంగణమనీ. అలాగే తిరుమల శైవులకు శైవక్షేత్రమనీ.. శాక్తేయుల శక్తిపీఠమని కూడా అంటారు. బాలాజీ అని పిలవడంలో ఆ మూల విరాట్టు బాలత్రిపురసుందరి కావడమే కారణమని చెబుతారు. ఇందులో నిజానిజాలెంత.. ఓ పరిశీలన‍. అన్నమాచార్య కీర్తనల్లో కూడా బాలాజీలోని ‘బాల’ శబ్ధానికి అర్ధమిదే అని చెప్పిన దాఖలాలున్నాయి. ‘సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచూ’ అంటూ స్వామి వివిధ మహిమలు కీర్తిస్తాడు అన్నమయ్య. ఇదే కీర్తనలో వెంకటేశ్వరుడ్ని వైష్ణవులతో పాటు… శైవులు శివుడిగా, కాపాలికులు ఆది భైరవుడిగా కొలుస్తారని పేర్కొంటాడు. ఇదే ఇక్కడ పరిశీలనాంశమైంది.

తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడు అసలు విష్ణు రూపం కాదన్నది ఒక వాదన. మూల విరాట్టు వెనుక భాగంలో జడ ఉంటుందట. అంటే దీనర్ధం ఏమిటి? అమ్మవారనేగా అంటారు కొందరు శాక్తేయులు. దానికి తోడు వేంకటేశ్వరుడ్ని బాలాజీ అని ఉత్తరాది ప్రజలు పిలుస్తుంటారు. దీనికి కారణం… ఈ మూర్తి బాలత్రిపురసుందరి రూపమన్నది మరో వాదన. అసలు స్వామివారికి జరిగే కొన్ని పూజలు.. శాక్తేయులు అమ్మవారికి మాత్రమే చేస్తారు. అవి విష్ణు సంప్రదాయానికి చెందినవి కాకున్నా ఆచారంలో వున్నాయని అంటారు. దీన్ని బట్టీ మూల విరాట్టు బాలత్రిపురసుందరి అమ్మవారని అంటారు.

ఆదిశంకరుడు ఈ స్థలం సందర్శించినప్పుడు.. మూల విరాట్టు పాదాల కింద శ్రీచక్రం ప్రతిష్టించారు. విష్ణుపాదాలకూ శ్రీ చక్రానికీ సంబంధమేంటి? ఇదంతా అలా వుంచితే శిల్పశాస్త్ర ప్రకారం మూలవిరాట్టు విగ్రహం స్త్రీ మూర్తి కొలతలకు సరిపోతాయట. అందుకనే వక్షస్తలం మూసి వేస్తూ శ్రీదేవీ- భూదేవులను వుంచారనేది వీరి వాదన. విగ్రహం వెనుక అమ్మవారి రూపం ఉంది- అందుకే ఆ విగ్రహం అయ్యవారిది కాదు. శక్తి స్వరూపిణి అంటూ పేర్కొంటారు. అసలు శరన్నవరాత్రులప్పుడు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరగుతున్నాయంటే తెలియడం లేదూ- అది శక్తి స్వరూపమనీ అంటారు. మూలవర్ శక్తికి చెందినది కనుకే ఇలా చేస్తున్నారన్న వాదనలున్నాయి.

దానికి తోడు, అన్నమయ్య అన్నట్టు.. శైవులు – శ్రీవెంకటేశ్వరుడ్ని శివరూపంగా భావిస్తుంటారు. గుడిపై వున్న శిల్పాలలో నంది ఉండటం ఇప్పటకీ గమనించవచ్చు. వైష్ణవాలయంలో నంది రూపు ఊహించలేనిదంటారు. దాంతోపాటు స్వామి పేరులో ఈశ్వర శబ్ధం వుండటం కూడా గమనార్హమే కావాలంటే పరిశీలించమంటారు. వేం అంటే- పాపములు, కట- అంటే తొలగించు.. ఈశ్వరుడు కలిపితే వేంకటేశ్వరుడవుతుంది. అంతే కాదు శివుని మూడో నేత్రం కప్పి వుంచడానికే పెద్ద నామం పెట్టారన్నది వీరి భాష్యం.

ఈ వివాదాలన్నిటికీ తెరవేస్తూ శ్రీరామానుజుల వారు మూలవిరాట్టుకు శంఖు, చక్రాలను అమర్చి ఈ క్షేత్రాన్ని-శ్రీవైష్ణవ క్షేత్రంగా ప్రకటించారట. ఇంతకీ శ్రీవారు శివుడా- విష్ణువా- లేక శక్తా అన్నది ఇప్పటికీ తేలని రహస్యమని అంటారు. దాన్ని బలపరుస్తూ అన్నమయ్య కూడా కీర్తనలు రాయడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చుతున్నట్టుగానూ కనిపిస్తుంది. ఇందులోని సత్యాసత్యాలు ఆ స్వామికే ఎరుక
ఇది కేవలం పూర్వం మహనీయులకు కలిగిన ఆలోచనకు వాఖ్య రూపం మాత్రమే
శివాయ విష్ణు రూపాయ విష్ణు శివరూపాయ శివస్య హృదయం విష్ణు: విష్ణూశ్చ హృదయం శివః వారి ఇరువురికి బేధం లేదు.మనం చూసే దృష్టి లోనే ఉంది ఓమ్ నమో వెంకటేశ్వరాయ….శుభం

*****************************************

జ్ఞానవాహిని లో పొందుపరచే విషయాలు మీకు నచ్చితే దయచేసి షేర్ చేయగలరు

దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలను జ్ఞానవాహిని వాట్స్ యాప్ నెంబర్ కు సందేశరూపంలో తెలియచేయండి

జ్ఞానవాహిని వెబ్ సైట్ ను  మీ ప్రకటనల( ADDS)ద్వారా ప్రోత్సహించండి.

ప్రతి రోజు ఆధ్యాత్మిక విషయాల కొరకు టెలిగ్రామ్ ,వాట్స్ యాప్  గ్రూప్ నెంబర్ :8977777599 

జ్ఞానవాహిని ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ కొరకు కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.

జ్ఞానవాహిని మొబైల్ యాప్

జ్ఞానవాహిని మెయిల్ .డి :gnanvahini9@gmail.com

*****జ్ఞానవాహిని వెబ్ సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు*****

                  నిరంతరం సనాతన ధర్మ సేవ లో

జ్ఞానవాహిని ఆధ్యాత్మిక సేవ సంస్థ

NO COMMENTS

LEAVE A REPLY